మూస రాజకీయాల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు

Sajjala Ramakrishnareddy Fires On Chandrababu. మూస రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పీహెచ్‌డీ చేశారని ప్రభుత్వ సలహాదారులు

By Medi Samrat  Published on  27 Sep 2021 1:47 PM GMT
మూస రాజకీయాల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు

మూస రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పీహెచ్‌డీ చేశారని ప్రభుత్వ సలహాదారులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ప్రపంచం కళ్ళు గప్పి మీడియాను మేనేజ్‌ చేయడంలో ఆరితేరాడని ఆరోపించారు. అందుకే ఆయన కనుసన్నల్లో నడిచే మీడియా రాష్ట్రంలో అందుతున్న ఫించన్లపై అనేక తప్పుడు కథ‌నాలతో ప్రభుత్వానికి తాటాకు కడుతోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2018 అక్టోబర్‌ నాటికి రాష్ట్రంలో 50లక్షల మంది ఫించన్లకు అర్హులైన లబ్దిదారులు ఉంటే.. నాటి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 39లక్షల ఫించన్లు మాత్రమేనని ఆరోపించారు. అది కూడా తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు హాజరైన వారికి మాత్రమే ఫించన్లు మంజూరు చేసేవారన్నారు. ఎన్నికలు దగ్గరపడే సరికి ఆ సంఖ్యను కేవలం లెక్కల్లో మాత్రం టకటకా పెంచేశారని విమర్శించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 లక్షల మందికి ఫించన్లు ఇస్తుంటే.. లక్షన్నర ఫించన్లు తొలగించారని చంద్రబాబు తోక మీడియా నానా యాగీ చేస్తోందన్నారు. వారిలో ఎవరైనా నిజంగా అర్హులైన వారు ఉంటే.. మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే.. తప్పకుండా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

చంద్రబాబులా జగన్‌ మూస రాజకీయ నాయకుడు కాదని సజ్జల స్పష్టం చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని విధాలా అణగారిన వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అందులో భాగంగానే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు జగన్‌ పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు. చంద్రబాబు చిన్న చిన్న పనిముట్లు, చిల్లర హామీలతో బీసీలను మోసం చేస్తే... సమాజానికి సంస్కృతి నేర్పిన గొప్ప కులాలుగా గుర్తించి బీసీలను సమాజానికే బ్యాక్‌ బోన్‌ కులాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ కూడా నిర్ధేశించుకుని తమ భవిష్యత్తు పట్ల బీసీల్లో సంపూర్ణ విశ్వాసాన్ని జగన్‌ నింపారన్నారు. సంపన్న వర్గాలతో సమానంగా ప్రతి బీసీ కుటుంబం తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేలా సమగ్ర వ్యూహం రచించారని తెలిపారు. తద్వారా బీసీల్లోని ప్రతి కులంలో ఉన్న ఆఖరి వ్యక్తి వరకు ప్రయోజనం చేకూరేలా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆలోచన, కార్యాచరణతో బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న నేపధ్యంలో బీసీల ఆలోచనా విధానంలో కూడా మార్పు రావాల్సి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆయన ఆలోచనా విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను స్వీకరించాలని కోరారు. విలక్షణమైన సంస్కృతి గల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఆదర్శవంతమైన నేత జగన్‌ పాలనలో సమ న్యాయం, సామాజిక న్యాయం సాధన దిశగా అత్యంత చైతన్యవంతమైన కులాల్లో ఒకటిగా శెట్టి బలిజ కులస్తులంతా ముందుకు కదలాలని చెప్పారు. జగన్‌ ప్రతినిధులుగా బలమైన నాయకులుగా ఎదుగుతూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. అప్పుడే జగన్‌ ఆశించిన పేదరిక నిర్మూలన సాధ్యమౌతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.


Next Story
Share it