వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్‌లను పరామర్శించారు. రెడ్‌బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు గ్రహించడం లేదన్నారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైందని సజ్జల ఆరోపించారు.
కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయన్నారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారని విమర్శించారు. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ చేసే దాడులను ఎదుర్కొనడానికి సిద్ధపడే ఉన్నామని సజ్జల తెలిపారు.