అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఏపీ సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో మాట్లాడుతూ, ఏపీ రాజధాని విశాఖ అని, మూడు రాజధానులు అంటూ జనాల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని సజ్జల స్పష్టం చేశారు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు. ఎన్నికల కోసం మేం రాజకీయం చేయబోం. ఎన్నికలుంటే ఒకమాట, లేదంటే మరోమాట చెప్పమన్నారు సజ్జల.