రాజమండ్రి మహానాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయని.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఏంచేశాడో చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు.. మేం ఇది చేశాం అని మేం చెప్పుకోగలం. కానీ చంద్రబాబు ఏం చెప్పుకోగలరు? అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చని సజ్జల అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటి అని ప్రశ్నించారు.
టీడీపీకి ఇదే చివరి మహానాడు అవుతుందని.. వచ్చే ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని వైసీపీ నేత అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. సైకిల్ స్క్రాప్‌గా మారిపోయిందని, తుక్కుతుక్కు అయిన సైకిల్‌ని మళ్లీ తొక్కాలని తాపత్రయం పడుతున్నారని సెటైర్లు వేశారు. ఆ సైకిల్‌ని కరెంటు శ్మశానంలో తగులపెట్టి ఆ బూడిదను లోకేష్, చంద్రబాబు తమ ముఖాలకు రాసుకోవాలని అన్నారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి రాంబాబు అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ఎప్పుడైనా ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన సంగతిని జనం మర్చిపోలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి గతంలో కూడా అప్పుడు కూడా మోసం చేయలేదా అని నిలదీశారు.