మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయంతో అవినాశ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. కోర్టు తీర్పుపై ఏపీకి చెందిన పలువురు నాయకులు తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కేసులో దర్యాప్తుకు సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని.. నిజాయతీపరులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలను ఆపాదిస్తూ కొన్ని ఛానల్స్ లో చర్చలు పెడుతున్నారని అన్నారు. మీడియా ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ కొనసాగాలని డిమాండ్ చేశారు. జగన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ వైసీపీ అని అప్పట్లో వైసీపీలో చేరతానని వివేకా అడిగితే జగన్ స్వాగతించారని సజ్జల తెలిపారు. పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో జగన్ దే తుది నిర్ణయమని చెప్పారు. వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదని అన్నారు.