చంద్రబాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యం : సజ్జల

వైఎస్‌ షర్మిల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.

By Medi Samrat  Published on  21 Jan 2024 8:45 PM IST
చంద్రబాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యం : సజ్జల

వైఎస్‌ షర్మిల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరగానే షర్మిల భాష, యాస మారిందన్నారు. షర్మిల మాట్లాడిన భాష, చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతోందని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలకు కట్టుబడి జగన్‌ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రాజశేఖర్‌ రెడ్డి వారసుడిగా జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎంత వేధించిందో అందరికీ తెలుసని అన్నారు. జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్‌ పార్టని అన్నారు.

షర్మిల వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని సజ్జల అన్నారు. అన్న కోసం ఒకప్పుడు పార్టీలో తనవంతు పాత్ర పోషించారని.. కానీ ఇప్పుడు అదే జగన్‌ను షర్మిల నేరుగా తిడుతున్నారని అన్నారు. తెలంగాణలో షర్మిల ఏం చేశారని.. ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికే లేదని అన్నారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. షర్మిల ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ పార్టీకి చేసేదేం లేదని విమర్శించారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలని అనుకుంటే షర్మిల తెలంగాణలో పోటీ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ప్రజలను చంద్రబాబు ఏమార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రల్లో షర్మిల ఒక అస్త్రంలా మారిందనిపిస్తోందని అన్నారు.

Next Story