త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ నిన్న ప్రకటించారు. ఇక అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోంది అంటూ ప్రచారం సాగుతోంది. దీనికి తోడు టీడీపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తోంది అంటూ పదే పదే చెబుతున్నారు. కాగా దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందన్నారు.
ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ బలోపేతం కూడా తమకు ముఖ్యమేనని సజ్జల అన్నారు. మంత్రులుగా ఉండే వాళ్లను అవసరాన్ని బట్టి పార్టీకి వినియోగించుకుంటామన్నారు. ఇక చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు అంటూ రాగాలు తీస్తున్నాడని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకేంటని సజ్జల ప్రశ్నించారు. పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు అనవసర డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం కట్టబెట్టారని, దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. ప్రజలని మోసం చేయాలనుకున్న వారే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.