అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్‌వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. నిధుల చెల్లింపులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చించారు. అనంతరం చర్యల్లో భాగంగా నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
అలాగే త్వరలో మరో రూ.250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య సేవల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆసోసియేషన్, ఇతర సంఘాల ప్రతినిధులను సౌరభ్ గౌర్ కోరారు. ఈ మేరకు బుధవారం తనని కలిసిన పలువురికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు.