ఐఐటీ తిరుపతి అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫేజ్-1లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి రూ. 1,091.75 కోట్లు విడుదల చేయగా ఈ క్యాంపస్ అక్టోబర్ 2023 నుండి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది ఫిబ్రవరి 2024లో ప్రధాని చేతుల మీదుగా దేశానికి అంకితం చేయటం జరిగిందని. ఇక ఫేజ్-2లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రూ. 2,313.02 కోట్లు మంజూరైనట్లు లోక్ సభలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
భారతీయ సాంకేతిక సంస్థల(IITs) మౌలిక సదుపాయాలు, విద్యా విస్తరణ కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలు, ఐఐటీలో కొత్త అధ్యాపకుల కోసం సృష్టించిన ఉద్యోగాల సంఖ్య, ఐఐటి తిరుపతి అభివృద్ది, నిర్మాణానికి కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలపై ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ను ప్రశ్నించారు.
భారతదేశంలో ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించిందని, 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల విద్యా, మౌలిక సదుపాయాల విస్తరణకు రూ. 11,828.79 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలిపారు. . ఇందులోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఐఐటీ తిరుపతి కూడా వుందన్నారు. ఈ ఐఐటీలలో కేంద్రం 130 కొత్త అధ్యాపక పోస్టులను కూడా ఏర్పాటు చేసిందని. ఈ పోస్టులు ప్రొఫెసర్ స్థాయిలో (లెవల్ 14 & ఆపైన) ఐఐటీ తిరుపతి, పాలక్కాడ్, భిలాయ్, జమ్మూ, ధార్వాడ్ వంటి ఐఐటీల్లో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐఐటీ తిరుపతిలో 6 బిటెక్ ప్రోగ్రాములు, 13 ఎమ్.టెక్ కోర్సులు, 3 ఎమ్.ఎస్.సి కోర్సులు, 1 పబ్లిక్ పాలసీ మాస్టర్స్, 9 విభాగాల్లో పి.హెచ్.డి కోర్సులు అందుబాటులో వున్నట్లు తెలిపారు. ఈ సంస్థలో 137 మంది పూర్తి స్థాయి అధ్యాపకులు, 8 మంది అదనపు అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఐఐటీ జోధ్‌పూర్, పట్నా, ఇండోర్‌లకు కూడా హెచ్.ఈ.ఎఫ్.ఎ ద్వారా రూ. 1,942 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు.