చికెన్ అంటేనే భయపడుతున్న నెల్లూరు జిల్లా వాసులు.. ఎందుకంటే..?
Rotten Chicken Seized in Nellore District.మాంసం ప్రియులకు చికెన్ పేరు చెప్పగానే నోరూరుతుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2022 5:02 AM GMTమాంసం ప్రియులకు చికెన్ పేరు చెప్పగానే నోరూరుతుంది. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ వండాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. ఇంకొందరికి రోజు చికెన్ ఉండాల్సిందే. ఇంతలా ఇష్టమైన చికెన్‌ను కొనేముందు ఆ చుట్టు ప్రక్క పరిసరాలతో పాటు చికెన్ దుకాణాన్ని ఓ సారి పరిశీలించండి. ఎందుకంటే కొందరు చికెన్ షాప్ యజమానులు కాసులకు కక్కుర్తి పడి కుళ్లిపోయిన, పాడైపోయిన చికెన్ ను వినియోగదారులకు అంటగడుతున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేశారు. హరినాథపురంలోని ఓ గోడౌన్‌లో 500 కేజీల కుళ్లిన చికెన్ నిల్వలను అధికారులు పట్టుకున్నారు. అంజాద్ బాషా అనే వ్యాపారి ఓ ఫ్రీజర్‌ను ఏర్పాటు చేసి అందులో చికెన్‌ను నిల్వ ఉంచి నగరంలోని హోటళ్లకు విక్రయిస్తున్నాడు. చుట్టుపక్కల వారికి కుళ్లిన వాస రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు దాడులు చేసి కుళ్లిన చికెన్‌ను బయటకు తీశారు. పురుగు పట్టి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ పై ఫినాయిల్ పోసి ఆ చికెన్ ను నిర్వీర్యం చేశారు.
అనంతరం దాన్ని డంపింగ్ యార్డుకు తరలించారు. గోడౌన్‌ను సీజ్ చేశారు. ఇలాంటి చికెన్‌ను తింటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు దీన్ని తినడం మరింత ప్రమాదకం అని వైద్యులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలో నెలన్నర వ్యవధిలో ఇలా కుళ్లిన చికెన్ పట్టుకోవడం ఇది రెండోసారి. చెన్నై, కోయంబత్తూరు నుంచి తక్కువ ధరకు కుళ్లిపోయిన మాంసాన్ని దిగుమతి చేసుకుని ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు వ్యాపారులు. అధికారులు తనిఖీలు చేస్తున్న వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. దీంతో చికెన్ అంటేనే భయపడిపోతున్నారు ప్రజలు.