మాకు ఫ్యామిలీ, పిల్లలు, గౌరవం లేవా..? బై.. బై.. బాబు
Roja Comments On Chandrababu. ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఉదయం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని ఉద్దేశించి
By Medi Samrat Published on 19 Nov 2021 10:44 AM GMTఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఉదయం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ క్రమంలో అంబటి రాంబాబు టీడీపీ నేతలకు కౌంటర్‌గా చేసిన వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది. అనంతరం చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగతంగా తన భార్య, కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలతో కలత చెందానని అన్నారు. వైసీపీ సభ్యులు శృతి మించి వ్యవహరిస్తున్నారని.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడతానని చంద్రబాబు సభ నుండి వెళ్లిపోయారు. అనంతరం ప్రెస్ మీట్‌లో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు.. విధి ఎవ్వరిని విడిచి పెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడ్పించావో గుర్తుందా.. 71 ఏళ్ల 7 నెలలకే నీకు ఏడ్చే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఏదో.. మీ భార్యను అన్నారని బాధపడుతున్నారే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిలింస్‌లో యాక్ట్ చేసిందంటూ పీతల సూజతతో మీడియా పాయింట్‌లో సీడీలు చూపించిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. మాకు ఫ్యామిలీ, పిల్లలు, గౌరవం లేవా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఏమైనా అంటారు.. విజయమ్మ, భారతి, షర్మిలల గురించి ఏ విధంగా మట్లాడింది ఎవరూ మర్చిపోలేదని అన్నారు.
ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడుస్తున్న నిన్ను.. ఎవరూ జాలితో కూడా చూడరని తెలుసుకో.. అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీతో సహా ఎవ్వరిని వదిలిపెట్టకుండా ఎన్ని మాట్లాడింది.. ఎన్ని రాయించింది ప్రతి ఒక్కరికి గుర్తుందన్నారు. మహిళ అని కూడా చూడకుండా.. మీ కోసం పది సంవత్సరాలు పనిచేసిన నన్ను రూల్స్‌కు వ్యతిరేకంగా సంవత్సరం అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి.. మానసికంగా క్షోభకు గురిచేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. నీవు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు నీకు తగిలిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా నన్ను ఒక్క సంవత్సరమే అసెంబ్లీకు దూరంగా ఉంచావ్.. నిన్ను ఆ దేవుడు రెండున్నర సంవత్సరాలు కాదు కదా.. జీవితంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టని విధంగా నీకు నీవే శపథం చేసుకున్నావ్.. బై బై బాబు.. బై బై అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.