Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌

రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By -  అంజి
Published on : 6 Feb 2026 7:02 AM IST

labor welfare schemes, CM Chandrababu, labor department, APnews

Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌

అమరావతి: రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు కల్పించాలని పేర్కొన్నారు.

అసంఘటిత రంగంలోని కార్మికులను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించాలని, యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీతోపాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు, ఆపై ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంచే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్‌ అండ్‌ టి, ఎన్‌సీసీ, మిట్టల్‌ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు ఆర్జించేలా చూడాలని స్పష్టం చేశారు. నైపుణ్యం పోర్టల్ కు అనుసంధానించటంతో పాటు వారు వివిధ కోర్సులు అభ్యసించి విద్యార్హతలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షకు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story