జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ గా విచారించారు. వీరి రిమాండ్ ను జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. ప్రస్తుతం వీరు నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
2025 మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములు ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టి, బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 9 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని ఏ7గా పేర్కొన్నారు.