ఏపీ మాజీ సీఎం జగన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది. వివిధ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ రద్దు చేయాలని, ఆ కేసుల విచారణ మరో కోర్టుకు బదిలీ చేయాలని నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జగన్‌పై ఉన్న కేసులపై ప్రత్యేక విచారణ అవసరంలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో రఘురామకృష్ణంరాజు కోర్టులో వేసిన తన పిటిషన్లను వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. దీంతో మాజీ సీఎం జగన్‌కు ఈ విషయంలో స్వల్ప ఊరట లభించినట్లయింది.
అయితే మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ సరిగా జరుగుతుండటం లేదని, విచారణ పూర్తవడం కూడా లేదని రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అందులో తెలిపారు. గత 12 సంవత్సరాలుగా మాజీ సీఎం జగన్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయకుంటే ఈ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరిగే అవకాశం ఉందని మరో పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా వీటిని సోమవారం రోజు కోర్టు నిర్ణయంతో రఘురామకృష్ణంరాజు వెనక్కి తీసుకున్నారు.