ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్ధతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పోలీసులు హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నంద్యాల నియోజకవర్గంలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో దీనిపై వాద ప్రతివాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించింది. ఆయనపై నమోదయిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.