AP : మే నెల భద్రతా పెన్షన్ల సొమ్ము విడుదల

మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం రూ.1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ బుధవారం ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు

By Medi Samrat  Published on  29 May 2024 7:04 PM IST
AP : మే నెల భద్రతా పెన్షన్ల సొమ్ము విడుదల

మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం రూ.1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ బుధవారం ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు..

మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షన్లలో 47,74,733 పెన్షన్లు (73.11%) ప్రత్యక్ష నగదు బదిలీ(DBT) పద్ధతి ద్వారా 17,56,105 పెన్షన్లు (26.89%) డోర్-టు-డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లించబడతాయని ఆయన తెలిపారు.

పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాల్లోకి జూన్ 1, 2024 న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా సొమ్ము జమ చేయబడుతుందన్నారు. ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు/ వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖల నుండి మే 31, 2024న పెన్షన్ నగదును డ్రా చేసి, పెన్షన్లను పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్న ఇతర గ్రామ/వార్డు కార్యాలయ సిబ్బందికి అప్పగించాలని ఆయన ఆదేశించారు. సదరు సిబ్బంది 1 జూన్ నుండి 5 జూన్, 2024 వరకు డోర్-టు-డోర్ పంపిణీ చేయాలని శశిభూషణ్ కుమార్ సూచించారు.

ఏప్రిల్ 28, 2024న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మెమో నం. 2391982/RD.I/A1/2024 ద్వారా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నియమావళిని పాటిస్తూ.. పెన్షన్‌దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహించాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.




Next Story