ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం..నాలుగు గిన్నిస్ రికార్డులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది.
By - Knakam Karthik |
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం..నాలుగు గిన్నిస్ రికార్డులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు - కడప - విజయవాడ (BKV) ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథార్టీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్‌పై ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి. ఈ అసాధారణ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు, రాష్ట్ర యంత్రాంగానికి, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఆరు రోజుల్లో అద్భుతం - 156 లేన్ కిలోమీటర్ల నిర్మాణం
సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని వానవోలు - వంకరకుంట - ఓదులపల్లె సెక్షన్‌లో (ప్యాకేజీ-2, 3) ఈ రికార్డు స్థాయి పనులు జరిగాయి. ఈనెల 5వ తేదీ ఉదయం 10:07 గంటల నుండి 11వ తేదీ ఉదయం వరకు, అంటే కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 52 కిలోమీటర్ల మేర (156 లేన్ కిలోమీటర్లు) రోడ్డు నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును నిరంతరాయంగా వేసి ఇంతకుముందున్న 84.4 లేన్ కిలోమీటర్ల నిర్మాణం చేసి ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇదే కాకుండా.. జనవరి 6వ తేదీన ఇదే కారిడార్‌లో రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే 28.896 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ వేయడం ద్వారా ఒక రికార్డు, అలాగే 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీటును ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్థాయి ఘనతను సాధించి మరో రికార్డును నెలకొల్పారు. తాజా విజయాలతో కలిపి ఈ ఎకనామిక్ కారిడార్‌లో మొత్తం 4 గిన్నిస్ రికార్డులు నమోదైనట్లయింది.
అత్యాధునిక యంత్రసామగ్రి - క్వాలిటీతో నిర్మాణం
ఈ రికార్డు నెలకొల్పడం కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లు, అత్యాధునిక సెన్సార్ పేవర్లను వినియోగించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఐఐటీ బాంబే (IIT Bombay) వంటి ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే బెంగళూరు - విజయవాడ మధ్య ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 4 గంటల మేర తగ్గనుంది. ఇదే స్ఫూర్తితో మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.