పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By - Knakam Karthik |
అమరావతి: పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ ఆదివారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు. లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం. ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయి. వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం" అని విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్డీటీ సేవలకు కలిగిన అంతరాయం తదనంతర పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని మార్గాలు చూస్తున్నామని, కేంద్రంతో ఇదివరకే సంప్రదించామని, ఆర్డీటీ సేవలు కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ, మానవతా సేవా బంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపించే మాంఛో ఫెర్రర్ అంటే తనకు ఎంతో అభిమానం అని లోకేష్ తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక రంగాల ద్వారా ప్రజలకు ఆర్డీటీ అందించిన అన్ని సేవలూ యథాతథంగా త్వరలోనే కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.