టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుటుంబంలో ఇటీవల విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే..! టీడీపీలోనే కొనసాగుతామని ఆయన తనయుడు రాయపాటి శ్రీనివాస రావు తెలిపారు. తాము రాయపాటి రంగారావును ప్రోత్సహించడం లేదని.. తొలి నుంచి ఇప్పటి వరకూ తాము ఉమ్మడి కుటుంబంగానే ఉన్నామని తెలిపారు. ఇంతకుముందు రాజకీయ అంశాలపై కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునే వారం అని పేర్కొన్నారు. కానీ తమ కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చాయని, తాము మాత్రం టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లతో తమకెటువంటి ఇబ్బంది లేదన్నారు.
సత్తెనపల్లి అసెంబ్లీ సీటును రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఆశించారు. కానీ, ఆ స్థానాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు చంద్రబాబు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కన్నాకు టికెట్ ఇస్తున్నట్లు తనకు చెప్పలేదని.. తమ కుటుంబాన్ని టీడీపీ సర్వ నాశనం చేసిందన్నారు రంగారావు.