బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. 24న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండడంతో రాష్ట్రమంతా దట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనుంది.