ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత బడా నాయకుడు ఎవరు అంటే రఘువీరా రెడ్డి అని చెప్పేవారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం.. కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినడం మొత్తం జరిగిపోయాయి. రఘువీరా రెడ్డి అప్పుడప్పుడు కనిపించే వారు తప్పితే పెద్దగా రాజకీయాల్లో కనిపించేవారు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు నాలుగో విడత సందర్భంగా ఆయన కనిపించారు. ఆయన ఎంట్రీ ఎంతో సాదాసీదాగా ఉంది. ఓ మోపెడ్ లో అలా తన భార్యను కూర్చోపెట్టుకుని రావడం విశేషంగా ఉంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన్ను చూడగానే గుర్తు పట్టారు.. చాలా మంది ఆయన్ను ఎక్కడో చూశామే అనే అయోమయంలో గడిపేశారు.

మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి తన సతీమణి సునీతా రఘువీర్‌తో పాటు టీవీఎస్‌ మోపెడ్‌పై వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం. పోలింగ్‌ కేంద్రం మాత్రం అక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలోని గంగులవాయిపాళ్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు రెండు చోట్ల విజయం సాధించారు. గంగులవాయిపాళ్యంతో పాటు గోవిందాపురం పంచాయతీలోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెం2 నాయకుడిగా ఉండి అసెంబ్లీలో గడగడలాడించిన రఘవీరారెడ్డి ఇప్పుడు తన సొంత ఊరులో అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతూ ఎంతోమంది నేటి రాజకీయ నాయకులకు పదవులు శాశ్వతం కాదు అని కనువిప్పు కలిగిస్తోంది.


సామ్రాట్

Next Story