ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు నేఫథ్యంలో నమోదైన కేసులో అరెస్టైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు బెయిల్ పిటీషన్ పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో హైకోర్టు రఘురామ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది, రఘురామ కృష్ణ రాజు కుమారుడు భరత్ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటీషన్లపై ఈ రోజు ఉదయం 10.30 గంటలకు విచారణ జరుగుతుంది. జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల నేతృత్వంలోని బెంచ్ ఈ పిటీషన్లపై విచారణ జరుపనుంది.
ఇదిలావుంటే.. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామను మూడు రోజుల కిందట సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. కింది కోర్టుకు వెళ్లమని ఉన్నత న్యాయస్థానం సూచించింది. జిల్లా కోర్టు రఘురామకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో రఘురామ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.