కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్నా రాయలసీమ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యాన్ని ఆమె ఎత్తిచూపారు. ఇటీవల పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి.. రాష్ట్ర పర్యటనకు రాయలసీమ నుంచి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ జోనల్ స్థాయి సమావేశానికి హాజరైన ఆమె పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు.
తన తండ్రి ఎన్టీఆర్ కూడా రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని పురంధేశ్వరి గుర్తుచేశారు. ఇదే ప్రాంతం నుంచి రాష్ట్ర పర్యటనను ప్రారంభించడం పట్ల పురంధేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పురంధేశ్వరి స్పందిస్తూ.. ఆయన బీజేపీలో లేరని, ఆయన కుమార్తె శబరి బీజేపీలోనే ఉన్నారని అన్నారు. విమర్శించే బదులు బైరెడ్డి గడ్కరీకి లేఖ రాయాలని సూచించారు.