జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి

విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.

By Medi Samrat  Published on  8 Jan 2025 2:30 PM IST
జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి

విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రతిపాదిత విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన విషయమని అందుకే విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇందుకు జనవరి 26, 2025 లోపు వారి అభ్యంతరాలను, సూచనలను biereforms@gmail.com మెయిల్ కు చేయాలని, ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని నిర్వహించడం లేదన్నారు. అత్యధిక శాతం ఇంటర్ బోర్డులు, యూనివర్శిటీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది భావిస్తున్నామన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్ గా నిర్వహిస్తాయన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీ సిలబస్ ను ప్రవేశ పెడుతున్నామన్నారు. మొదటి ఏడాది పరీక్షల్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, ఆ మార్కుల్నే అర్హతగా పరిగణిస్తున్నారన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియేట్ విద్య సిలబస్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి సంస్కరణలు జరగలేదన్నారు. అందుకే 4 విధాలుగా వాటిని చేయాలని చూస్తున్నామని అందులో ప్రతిపాదిత సిలబస్ సవరణ, నూతన సబ్జెక్టు కాంబినేషన్ల ప్రతిపాదన, పరీక్షల్లో మార్కుల కేటాయింపు విధానంలో, ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలపై నిర్ణయం అనే నాలుగు అంశాలు ఉన్నాయన్నారు. గతంలో చేపట్టబడిన సవరణలు సైన్స్ సబ్జెక్టులకు ఫస్ట్ ఇయర్ కు 2012-13లో, సెకండ్ ఇయర్ కు 2013-14 లో, ఆర్ట్స్ సబ్జెక్టులకు 2014-15లో, సెకండ్ ఇయర్ కు 2015-16 లో, లాంగ్వేజెస్ కు 2018-19లో, సెకండ్ ఇయర్ కు 2019-20 లో జరిగినట్లు తెలిపారు. పాఠశాల విద్యా శాఖ 2024-25 విద్యా సంవత్సరం నుండి 10 వ తరగతిలో NCERT పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారని తదనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియేట్ ప్రధమ సంవత్సరంలో విద్యాభ్యాసన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగడానికి NCERT పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన NEET & JEE సిలబస్లతో సారూప్యత సాధించడానికి కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్ ను సవరించవలసిన అవసరం ఏర్పడుతుందన్నారు.

దేశవ్యాప్తంగా 15 కు పైగా రాష్ట్రాల్లో ఇంటర్ విద్యలో NCERT పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాయన్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కల్గిన విశ్యవిద్యాలయ ఆచార్యులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు జూనియర్ కళాశాల అధ్యాపకులతో ప్రతి సబ్జెక్టుకు ఒక ఎక్స్ పర్ట్ కమిటీ చొప్పున మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేసి వారి సిఫార్సుల ప్రకారం మార్పులకు ప్రతిపాదించామన్నారు. సైన్స్ గ్రూపుల్లో ఉమ్మడి ఏపీలో చివరి సారి సిలబస్ సవరణలు జరిగాయన్నారు.

దేశ వ్యాప్తంగా ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని సెకండియర్ సిలబస్తో మాత్రమే నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తారన్నారు..

ఈ ప్రతిపాదనలపై సలహాలు సూచనల్ని 2025 జనవరి 26 లోపు ఇంటర్ బోర్డుకు తెలియచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వారిని కోరారు. సవరించబడిన సిలబస్ ను విద్యా మండలి పోర్టల్ bieap.gov.in ఉంచామని అదేవిధంగా biereforms@gmail.com మెయిల్ కు తమ అభిప్రాయాలను పంపాల్సిందిగా కోరుతున్నామన్నారు.

కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయన్నారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మరియు ప్రాక్టికల్స్ తప్పనిసరన్నారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారన్నారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5/6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారన్నారు.

Next Story