అర్హత ఉన్నా పథకాలు అందని వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌

అర్హులందరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర' చేపట్టనుంది.

By అంజి  Published on  5 Nov 2023 2:05 AM GMT
Prime Minister Modi, Vikasit Bharat Sankalp Yatra, National news

అర్హత ఉన్నా పథకాలు అందని వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌

అర్హులందరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఎంవై, పీఎం కిసాన్‌, ఫసల్‌ బీమా, పోషణ్‌ అభియాన్‌, ఉజ్వల, గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన తదితర పథకాలకు అర్హులను గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా 2.7 లక్షల పంచాయితీలలో 'వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర' చేపడుతోంది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ 110 గిరిజన జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో నవంబర్‌ మూడో వారం నుంచి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు.

ఈ నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రచారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. యాత్ర సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. అలాగే సీఎస్‌ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో సీనియర్‌ అధికారి నేతృత్వంలో కమిటీ ఉంటుంది. వారంలో 14 గ్రామ పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యాత్ర కొనసాగేలాగ ప్రణాళికను రూపొందించడంతో పాటు ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వ ఐటీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.

ఇదిలా ఉంటే.. నవంబర్ 20 నుంచి ప్రతిపాదిత వికసిత్‌ భారత్ సంకల్ప్ యాత్ర కోసం సీనియర్ బ్యూరోక్రాట్‌లను డిప్యూట్ చేయాలన్న ప్రభుత్వ యోచనపై ఫిర్యాదులను స్వీకరించిన ఎన్నికల సంఘం, ఈ కార్యక్రమం ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో, రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలని క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాను గత గురువారం ఆదేశించింది. అంతకుముందు రోజు సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో యాత్ర జరగదని ,ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రాష్ట్రాల్లో ప్రారంభమవుతుందని చెప్పారు.

Next Story