కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన

నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు.

By -  Knakam Karthik
Published on : 16 Oct 2025 7:36 AM IST

Andrapradesh, Kurnool and Nandyal districts, Prime Minister Modi

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌: నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. జీఎస్టీ సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని పండుగలా జరుపుతోంది. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు రూ. 8 వేల కోట్ల మేర భారం తగ్గుతుందని ఓ అంచనా. ఈ క్రమంలో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ ఏపీ వస్తున్నారు.

అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రధాని విశాఖ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాయలసీమ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరగనుంది.

జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది. మండల స్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విద్యా సంస్థల్లో కూడా జీఎస్టీ సంస్కరణలపై రకరకాల పోటీలు నిర్వహించారు. వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లబ్దిని ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా... కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. యోగా డే సందర్భంగా ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రచారం చేపట్టిందో... ఇప్పుడు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మండలాల వారీగా, జిల్లాల వారీగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని మరీ జీఎస్టీ సంస్కరణలపై ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమికి చెందిన మూడు పార్టీలు చేపట్టాయి. ప్రస్తుతానికి 90 వేలకు పైగా ఈవెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన క్రమంలో కర్నూలులో ప్రధాని హజరు కానున్న భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

Next Story