ప్రభుత్వంతో చర్చలు లేవు.. మునిగినా తేలినా సమ్మెలోకే
PRC Struggle committee strike in Andhrapradesh.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ఇప్పట్లో చల్లారేలా
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 3:34 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఉద్యోగసంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. తాము ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. విజయవాడలో ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నిరసన కార్యక్రమాల్లో తాను ఇప్పటి వరకు పాల్గొనలేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు. పీఆర్సీతో మొదటి సారి జీత తగ్గే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాలని ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. మునిగినా తేలినా సరే అని అనుకుని సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల కడుపు మండేలా అధికారులు పీఆర్సీ జీవోలు తయారు చేశారని.. ఉద్యోగ సంఘాలను పూచికపుల్లలా బావించి అధికారులు జీవోలు తయారు చేశారని మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసం ఉద్యోమంలోకి వచ్చి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
అంతకముందు పీఆర్సీ సాధన సమితి భేటీ జరిగింది. పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని మంత్రుల కమిటీకి రాసే లేఖలో కోరాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు మళ్లీ చర్చలు జరపాలన్నారు.