పురందేశ్వరిపై విమర్శల వర్షం కురిపించిన పోసాని
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 23 Sept 2023 8:19 PM ISTఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పక్కా అవినీతిపరుడని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. చంద్రబాబు గురించి నాడే ఎన్టీఆర్ బయటపెట్టాడన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడును ఇంకా ఎన్ని రోజులు వెనకేసుకుంటూ వస్తారని పోసాని పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పురందేశ్వరి గారూ.. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో మీ నాన్న గారు చెప్పారు. మీరు నమ్మరు. పోనీ.. మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబుకి ఎంత గూంఢా మెంటాలిటీ ఉందో చెప్పారు. బస్సులు తగలబెట్టిస్తాడు, అనుచరులతో పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అని చెప్పారు. మీరు స్వయంగా విన్నారు. మీరు నమ్మరు. లేటెస్ట్‌గా మీకు ఒక కొత్త నాయకుడు వచ్చాడు.. నరేంద్ర మోదీ గారు. ఆయన చాలా హానెస్ట్ పొలిటీషియన్. ఆయనే చంద్రబాబు ఎంత అవినీతిపరుడు, ఎలా తింటాడు, ఏటీఎం హై అని చెప్పారు. చంద్రబాబు కేడీ నెంబర్ వన్, గూంఢా, రౌడీ, అవినీతిపరుడు అని ఇంత మంది చెప్పినా మీరు ఇప్పుడు అదేదో స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ మీద అనుమానంగా ఉంది అని అంటారంటూ విరుచుకుపడ్డారు.
ఎన్నిసార్లు పార్టీలు మారుతారు మేడం? అని ప్రశ్నించారు. నిత్యం పార్టీలు మారే మీకు జగన్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలా చేరారు? అందులో కేంద్రమంత్రి పదవిని ఎందుకు తీసుకున్నారు? అని అడిగారు. రేపు ఎన్నికల్లో సమీకరణాలు మారితే మళ్లీ కాంగ్రెస్‌లో చేరి సోనియా, రాహుల్ గాంధీలకు జై కొడతారా? అని పోసాని ప్రశ్నించారు. మీలా పార్టీలు మారే వ్యక్తులు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం కరెక్ట్ కాదని.. మీరు ఏమి చేస్తున్నారో ఓ సారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంటూ పోసాని మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.