నెల్లూరులో పొలిటికల్‌ హీట్‌.. మాజీ మంత్రి అనిల్ కుమార్‌‌కు ఆనం సవాల్

ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో

By అంజి  Published on  25 Jun 2023 2:37 PM IST
Nellore, Anam ramanaraya reddy, anil kumar yadav, APnews, YCP

నెల్లూరులో పొలిటికల్‌ హీట్‌.. మాజీ మంత్రి అనిల్ కుమార్‌‌కు ఆనం సవాల్

ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నేతల మధ్య సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలకు మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయాలన్న మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమని చెబితే.. అక్కేడ తన పోటీ ఉంటుందన్నారు.

ఒక వేళ నెల్లూరులోని 10 నియోజకవర్గాల గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పగిస్తే, ఆ పని కూడా చేస్తానన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ తన వైపు తిప్పుకుందని, ముందు ఆ ముగ్గురితో రాజీనామా చేయించాలని, ఆ తర్వాతే తమను అడగాలని స్పష్టం చేశారు. తాము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. సంవత్సరం అధికారం ఉన్నా.. వద్దనుకుని అధికార పార్టీ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై అనవసర విమర్శలు సరికావన్నారు. లోకేష్‌ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి సహించలేకపోతున్నారని, అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు

సొంత నేతలపై కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, పోటీగా ఉన్నారని నేతలను తిడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. నెల్లూరు.. అవినీతి, డ్రగ్స్‌, అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. నెల్లూరులోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్న ఆనం.. అక్కడే తన రాజకీయం ముగించాలని అనుకుంటున్నానని తెలిపారు. గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి నుంచి పోటీ చేశానన్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం టీడీపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. మరీ ఈ సారీ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చూడాలి.

Next Story