టీడీపీకి ప్రశాంత్ కిషోర్ అందించిన సమాచారం అదేనా.?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ముగిసింది.

By Medi Samrat  Published on  23 Dec 2023 9:32 PM IST
టీడీపీకి ప్రశాంత్ కిషోర్ అందించిన సమాచారం అదేనా.?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారని చెబుతున్నారు. ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచిన‌ట్లు తెలుస్తోంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారని స‌మాచారం. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశార‌ని తెలుస్తోంది.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేడు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ చేరుకున్నారు. వారిరువురు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. 'షో టైమ్ కన్సల్టెన్సీ' పేరిట రాబిన్ శర్మ టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు.

Next Story