నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. 13వ తేదీ వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తొలుత విజయవాడ జైలుకు వారిని తరలించారు. అనంతరం నెల్లూరు జైలుకు మార్చారు.
వైసీపీ నేత జోగి రమేశ్‌ను పూర్తి ఆధారాలతో పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే జోగి రమేశ్ నకిలీ మద్యం తయారు చేయించారని, ఈ కేసులో అన్ని ఆధారాలూ సేకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఒకవేళ పోలీసు శాఖలో ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా జోగి రమేశ్‌కు అనుకూలంగా వ్యవహరించినా, కేసును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.