నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు

తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు..

By Medi Samrat  Published on  20 March 2024 2:41 PM IST
నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు

తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న లోకేష్ కాన్వాయ్‌లోని అన్ని కార్లను పోలీసులు తనిఖీ చేశారు. లోకేష్ పోలీసులకు సహకరించారు. మొత్తం అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లేకపోవడంతో కాన్వాయ్‌ని వదిలిపెట్టారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో నారా లోకేష్ సహకరించారు. కాన్వాయ్‌లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసి కోడ్‌కు విరుద్ధంగా ఏమీలేదని పోలీసులు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లోని వివిధ అపార్ట్మెంట్టుల్లో నివసిస్తున్న వారితో నారా లోకేష్‌ భేటీ అయ్యారు. వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు అనేక సూచనలు ఇచ్చారు.

Next Story