గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా నేడు ఏపీలోని రెండు జిల్లాల్లో శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించారు. అయితే.. ఈ కార్యక్రమానికి పోలీసులు నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిన్న రాత్రి నుంచే పోలీసులు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.
జనసేన పిలుపునిచ్చిన శ్రమదానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని మనోహర్ ధ్వజమెత్తారు. రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. శ్రమదానంలో పాల్గొనకుండా కార్యకర్తలను నిర్భందిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిని అష్ఠదిగ్బంధం చేశారన్నారు.
మరోవైపు ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసివేశారు. రాజహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. పవన్ మధ్యాహ్నం జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.