ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సత్యసాయి పేరుతో రూ.100 నాణెం, 4 పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. అంతకుముందు హిల్‌వ్యూ ఆడిటోరియంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సన్మానించారు. తర్వాత సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహా సమాధిని పీఎం దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో కాసేపు ధ్యానం చేశారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించారు.
శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టం అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అని తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. 'పవిత్ర ఆధ్మాత్మిక భూమి పుట్టపర్తి. ఇక్కడి నుంచే ఎన్నో కోట్ల మందికి బాబా మార్గనిర్దేశం చేశారు. ఎంతో మందిని ప్రభావితం చేశారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది సత్యసాయి సిద్ధాంతం. భౌతికంగా లేకపోయినా ఆయన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది' అని తెలిపారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని అన్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని ప్రధాని మోదీ అన్నారు.