పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. రెండు వారాల్లో మాచర్ల కోర్టులో లొంగిపోవాలని నవంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో పిన్నెల్లి బ్రదర్స్ ఇవాళ (డిసెంబర్ 11న) కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె. వెంకటేశ్వర్లు, జె. కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, ఆగస్టు 29న వారి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.