'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై హైకోర్టులో పిల్
ఏపీలోని జగన్ సర్కార్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Medi Samrat Published on 25 Nov 2023 1:01 PM GMTఏపీలోని జగన్ సర్కార్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు.
ఈ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య పిల్ వేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బహిరంగంగా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో జీవో, సర్క్యులర్, మెమోకాని జారీ చేయలేదని తెలిపారు.