పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కోసం పని చేయకు: వైసీపీ నేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన తొలి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jun 2023 10:39 AM ISTపవన్ కళ్యాణ్.. చంద్రబాబు కోసం పని చేయకు: వైసీపీ నేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన తొలి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీసంఖ్యలో వారాహి యాత్రలో పాల్గొన్నారు. పవన్ వారాహి యాత్రపై వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణు స్పందించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని.. చిరంజీవి వేసిన దారివల్ల పవన్‌కు అభిమానులు ఏర్పడ్డారని, వారి నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోలేక పోతున్నాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసేది తనకోసం, జనసేన పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తల కోసం కాదని, చంద్రబాబు కోసమని మంత్రి విమర్శించారు. పవన్ చంద్రబాబు కోసం పనిచేయడం మానేసి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఏమీ ఆశించకుండా ప్రతిఒక్కరికి న్యాయం చేయాలని చూడటం జగన్మోహన్ రెడ్డి అభిమతం అన్నారు. ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని, ఎన్ని పార్టీలు ఏకమైనా మళ్లీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మంత్రి అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో మాట్లాడుతూ నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడను అని మాటిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేనకే ఓటేయండి. గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా నిలుస్తానన్నారు. మేం బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి అండగా నిలవబోమని, వైసీపీ వైపే ఉంటామని ముస్లిం నాయకులు అంటారు. కానీ బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతుగా నిలబడింది వైసీపీనే. మరి ముస్లింలు వారికెలా అండగా ఉంటారు? నిజంగా బీజేపీ అండగా లేకపోతే, కేంద్రం వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిధులు ఇస్తుందన్నారు.