విజయవాడలోని ఎంబీకే భవన్‌లో రెండోవిడత జనవాణి - జనసేన భరోసా కార్యక్రమాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన పవన్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అయితే ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపుతామని తెలిపారు. సీఎం వెల్ఫేర్ ఫండ్, ఆరోగ్యశ్రీలో అమలుకాని అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ''రాష్ట్ర స్థాయి నాయకులు ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నాయకులు కూడా అదే చేస్తున్నారు. ఒక ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టుకునేందుదుకు లోన్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. ఇది దారుణం. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను బయటకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే నా దృష్టికి వచ్చాయి.'' అన్నారు.
అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉరుకులు, పరుగులు పెట్టిస్తారని హెచ్చరించారు. వైసీపీ నేతలు అధికార మదంతో కొట్టుకుంటారు.. అందుకే వారంటే తనకు చిరాకు అని పవన్ వ్యాఖ్యానించారు. అన్యాయాలను ఇప్పుడు అడ్డుకోకపోతే అవి కొనసాగుతూనే ఉంటాయన్నారు.