హోమం చేయనున్న పవన్ కల్యాణ్
ఎన్నికలకు ఏడాది సమయం మిగిలి ఉండగానే.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు
By అంజి Published on 9 Jun 2023 6:15 AM GMTహోమం చేయనున్న పవన్ కల్యాణ్
ఎన్నికలకు ఏడాది సమయం మిగిలి ఉండగానే.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేలా ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపట్టబోతున్నారు. తన ప్రచార రథంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరగనున్నారు. ఈ క్రమంలోనే తన యాత్రకు దైవ బలం కూడా తోడయ్యేందుకు హోమం నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో హోమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటన్నీ చకచకా జరుగుతున్నాయి. హోమం ఏర్పాట్లను పార్టీ నేతలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇప్పటికే వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం నాడు జనసేన నాయుకలు విడుదల చేశారు.
ఈస్ట్ గోదావరి నుంచి పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్రకు ముందు అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అనంతరం వెస్ట్ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో తమ పార్టీకి ఎక్కువగా బలం ఉంటుందని జనసేన అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ జిల్లాల్లో వారాహి యాత్ర మొదట నిర్వహించాలనుకున్నారు. యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.