ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నవంబర్ 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన పార్టీ తెలిపింది. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. భోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుని సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు షోలాపూర్ నగరం చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. 17న విదర్భ జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు.