ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పించారు. అనంతరం నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త సోమశేఖర్ కుటుంబ సభ్యులకు పవన్ రూ.5లక్షల చెక్ ను అందజేశారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి మొదటి, రెండో వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధులు చాలా మందిని కోల్పోయాను. విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళులు. ప్రజాస్వామ విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించాం. ప్రాణాలను ఫణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారు. ఈ భీమా పథకానికి నా వంతుగా కోటి రూపాయలు ఇచ్చాను.' అని పవన్ కల్యాణ్ అన్నారు.