మీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి

Pawan Kalyan Reacts On Amalapuram High Tension Issue. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు

By Medi Samrat  Published on  24 May 2022 2:31 PM GMT
మీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి

అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని.. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని.. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయ‌న అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాన‌ని అన్నారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండని ప‌వ‌న్ అన్నారు.










Next Story