సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టారు. 85 ఏళ్ల హరిరామజోగయ్య చేస్తున్న నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను పోలీసులు ఆయన కూర్చున్న కుర్చీతో సహా అంబులెన్స్ లోకి ఎక్కించి తరలించారు. ఆయన ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం నిరాహార దీక్షలకు లొంగదని ఆయనకు చెప్పానని.. వయసు, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని సూచించినట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ అంతకు ముందు 'కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గారు కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. 85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నాను. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలి' అని ప్రకటనలో తెలిపారు.