విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
మూడో విడత వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు పవన్. ఈ సారి విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 11:34 AM GMTవిశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగింది. రెండు విడతలుగా చేపట్టిన యాత్ర ముగిసింది. ఈ వారాహి యాత్ర ద్వారా ప్రజల సమస్యలను లేవనెత్తుతూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు.. వచ్చే ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా ముందుకు కదలుతున్నారు. ప్రస్తుతం రెండు విడుతల తర్వాత మూడో విడత వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ సారి విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైనే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్ర జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. వారాహి యాత్రపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
యాత్ర ఎక్కడ ప్రారంభం అవ్వాలి..? ఏ ఏ నియోజకకవర్గాల గుండా సాగాలన్న అంశంపై జనసేన పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ చర్చించారు. మొదటి, రెండో విడత వారాహి యాత్ర ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్వహించామని అన్నారు నాదెండ్ల. రెండు విడతలూ విజయవంతంగా జరిగాయని తెలిపారు. అంతకు మించిన స్థాయిలో విశాఖలో చేసే వారాహి యాత్ర ఉండాలని సూచించారు. ఇందుకోసం నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యి.. వారి సమస్యలు తెలుసుకుంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
విశాఖ నుంచి వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నాయకులు. వచ్చే వారం యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని.. వాటిల్లో అభ్యర్థులను నియమించడంపైనా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఆశావాహులు వచ్చి పవన్‌ను కలిసివెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా పొత్తుల గురించి పవన్ సంకేతాలు ఇస్తున్నా.. జనసేన పార్టీ నాయకులు మాత్రం పోటీ చేసే నియోజకవర్గాలపై పవన్‌కు క్లారిటీ ఉందని చెబుతున్నారు. పొత్తులపై ప్రకటన ఎప్పుడు చేయాలన్నది పవన్ చూసుకుంటారని అంటున్నారు.