మునుపటిలా కాదు..ఏపీ రాజకీయాల్లో వారాహి యాత్ర హాట్‌టాపిక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తోన్న వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం..
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 10:18 AM GMTమునుపటిలా కాదు..ఏపీ రాజకీయాల్లో వారాహి యాత్ర హాట్‌టాపిక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తోన్న వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యాత్ర పాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన నిర్వహిస్తోన్న బహిరంగ సభలకు జనాలు భారీగా వస్తోన్నారు. స్థానిక సమస్యలను కూడా ఆయన ట్రిగ్గర్ చేస్తూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు అయితే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సమాధానమే చెప్పలేకపోతున్నారు. దీంతో.. పవన్ కళ్యాణ్ గతంలో లాగా కాదని.. ఈసారి కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినా రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాడుతున్నారు. జూన్ 14న ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోందనే చెప్పాలి. యాత్రలో భాగంగా.. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు పవన్ కళ్యాణ్. స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తి అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. వైసీపీ నాయకుల అక్రమాలు చేస్తున్నారంటూ వారిపై ధ్వజమెత్తుతున్నారు. పవన్ ప్రశ్నలకు వైసీపీ నాయకులు కూడా కొన్నింటికి కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. పవన్ మాటలతో... ఆయన సభలకు వెళ్తున్న జనాలను చూసి ఈసారి గతంలో కాకుండా జనసేన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూ పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్న సమయంలో జనసేనకు కాపుల మద్దతు పూర్తి స్థాయిలో రాలేదన్న అభిప్రాయం ఉంది. టీడీపీకి కమ్మ సమాజికవర్గం.. వైసీపీకి రెడ్డి సామాజికవర్గం అండ ఉంటందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా ఏ వర్గం అండ లేకపోబట్టే.. బీజేపీ పుంజుకోలేకపోతోంది. అయితే.. పవన్ కు.. కాపు వర్గం అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం పవన్ గట్టి నమ్మకం కల్పించాల్సి ఉంది. ఆ నమ్మకం కల్పించేందుకే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాపులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను సీఎం అవ్వడానికి అవకాశం ఇవ్వాలని.. నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ చెబుతున్నారు. పవన్ కాపు రాజకీయ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు ముద్రగడను ప్రయోగించారు. కానీ అది ఫలించలేదు. పవన్ కళ్యాణ్ కాపు రాజకీయ వ్యూహం సక్సెస్ అయితే మాత్రం జనసేనకు ఓట్ బ్యాంకు పెరుగుతుంది.
అంతేకాదు మరోవైపు అందరు హీరోల అభిమానులన తన వైపు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎలాంటి ఈగోలు లేవని.. మిగతా హీరోలు కొందరు తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నారని బహిరంగంగానే చెప్పారు. ప్రభాస్, మహేశ్ బాబుని ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తుపడతారని.. కానీ తనని గుర్తు పట్టకపోవచ్చని చెప్పారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారని చెప్పారు. వారితో పోలిస్తే తాను చిన్న హీరోనే అని చెప్పారు పవన్. దీంతో.. ఆయన ప్రసంగం విన్న ఆయా హీరోల అభిమానులు పవన్‌కు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ సభల్లోనూ కనిపిస్తున్నారని సమాచారం.
గత తొమ్మిదేళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతున్నారని.. ఆయన హీరో వర్షిప్‌తో కాకుండా తమ కోసమే వస్తున్నారన్న అభిప్రాయంలో జనాలు ఉన్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హీరో అని సభలకు వెళ్లేవారు కానీ.. ఈసారి రాజకీయంగా మద్దతు తెలిపేందుకు వస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వారాహి యాత్ర తర్వాత కొద్ది రోజులు షూటింగుల్లో పాల్గొన్నా.. ఎన్నికల దగ్గరపడుతున్నందున మళ్లీ ప్రజల మధ్యకే వస్తారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ఈసారి ప్రజల మన్ననలు పొంది పవన్ అనుకున్నట్లుగా అసెంబ్లీలో అడుగుపెడతారా..? ఓటు బ్యాంకు పెంచుకుని కీలకంగా మారుతారా? అనేది ఎన్నికల వరకు వేచి చూడాలి.