వాటిన్నింటికీ రేపు సభలో సమాధానం చెబుతా : పవన్ కళ్యాణ్
Pawan Kalyan invites everyone to Janasena party formation day.జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
By తోట వంశీ కుమార్ Published on 13 March 2022 10:14 AM GMTజనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రేపు(సోమవారం) నిర్వహించనున్న సభకు జన సైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తి అయ్యాయి.
'జనసేన పార్టీని స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని మార్చి 14న 9వ ఏట అడుగుపెడుతున్నాం. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్నాం. రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవారు, జనసైనికులు, వీరమహిళలు, ప్రతి ఒక్కరు ఈ సభకు ఆహ్వానితులే. వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వాళ్లు ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ సభ కోసం పార్టీ నాయకులు గత 10 రోజులుగా చాలా కష్టపడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికకు దూరంగా ఉన్న వారి కోసం ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంగణానికి నేను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య గారి పేరు నిర్ణయించాం. వారి స్పూర్తిని కొనసాగిస్తామని' పవన్ కళ్యాణ్ అన్నారు.
'ఈ ఆవిర్భావ దినోవత్సావాన్ని అన్ని ఆవిర్భావ దినోత్సవాల్లాగా చూడడం లేదు. భవిష్యత్తు ఆంధ్రప్రద్రేశ్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయబోతున్నాం. గత రెండున్నరేళ్లలో ఏమి జరిగింది..?ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారు..? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? భావి తరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్తు ఇవ్వగలం..? వంటి అంశాలపై సభా వేదికపైనే మాట్లాడతాను. అందుకనే మీరందరూ క్షేమంగా వచ్చి సభను విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సభకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఇది మా హక్కు అని చెప్పాలని పిలుపునిచ్చారు. 'మన ఆవిర్భావ దినోతవ్సం మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ వారికి కూడా మనస్పూర్తిగా విన్నవిస్తున్నాం. సభకు పూర్తిగా సహకరించండి. ఈ కీలకమైన సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడబోతున్నాను. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎన్నో విమర్శలు చేశారు. వాటన్నింటపైనా కూడా ఆవిర్భావ దినోవత్సంలో సమాధానాలు చెబుతానని' పవన్ కళ్యాణ్ చెప్పారు.
భవిష్యత్తు ఆశల వారధి ఆవిర్భావ సభ - JanaSena Chief Shri @PawanKalyan#JanaSenaChaloAmaravati pic.twitter.com/gfPedo0j1S
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2022