ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడం ఏంటి..? : పవన్ కళ్యాణ్
Pawan Kalyan demands to give one crore rupees as compensation to Eluru Victims.ఏలూరు జిల్లా ముసునూరు మండలం
By తోట వంశీ కుమార్
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు అత్యంత విషాదకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడం ఆవేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విదాల ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కొ తరహా పరిహారాన్ని ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ తెలిపారు.
పోరస్ కెమికల్ కర్మాగారంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RixUuZjNUl
— JanaSena Party (@JanaSenaParty) April 14, 2022
'ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే ఫోరస్ ప్రమాదంలో చనిపోయినవారికి రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదు. ఈ ఘటనలో 13 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించి న్యాయ బద్దంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.' అని పవన్ అన్నారు.