టీడీపీ-జనసేన కూటమిని నేనే ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2024 9:30 PM ISTఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని తాడేపల్లిగూడెం సభలో టీడీపీ-జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ - జనసేన సభలో పవన్ మాట్లాడుతూ.. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఉందన్నారు. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. సభా వేదికగా చెబుతున్నా.. వైసీపీ గూండాలు తెలుగు దేశం-జనసేన నాయకులను, శ్రేణుల్ని ఇబ్బంది పెడితే మక్కెలు విరగొడతామని వార్నింగ్ ఇచ్చారు.
తాను ఒక్కడినే అంటున్న జగన్ మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని అసహనం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్ బతుకు నాకు తెలుసని అన్నారు. జగన్ ఇప్పటి వరకూ పవన్ తాలూకా శాంతినే చూశావు. 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారు. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయన్నారు. టీడీపీ-జనసేన సహకరించుకుంటూనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకొని వచ్చానని.. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానని పేర్కొన్నారు.