ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9వ తరగతి వరకూ పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అలాగే పిల్లలకు స్కూల్స్ కూడా లేవని తేల్చేసింది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జ‌రుగుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ప్రభుత్వ నిర్ణ‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమేనని తెలిపారు. ఈ నిర్ణ‌యంతో లక్షలాది విద్యార్థులను మాత్ర‌మే కాకుండా వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని.. ఇప్ప‌టికే సీబీఎస్ఈ కూడా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసి ప్రమోట్ చేసిందని గుర్తు చేశారు. ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లు, హాస్టల్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారని గుర్తు చేశారు. జూనియర్‌ కాలేజీలు, ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు, వాటి హాస్టళ్లలో ఉన్నవారు ఈ వైరస్‌ సోకి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం చాలా తప్పని అన్నారు. సి.బి.ఎస్‌.ఈ., తెలంగాణ విద్యార్థులకు లేని ఇబ్బందులు ఏపీలో ఎందుకు తలెత్తుతాయా.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2020లో 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికెట్స్‌ జారీలో రాష్ట్ర విద్యా శాఖ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఆ తప్పును సరిదిద్దుకోకపోగా మరిన్ని తప్పులు చేసి ప్రజలను కరోనా ముందు నిలబెడుతున్నారన్నారు. కేంద్రం 11వ తరగతి, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలి అన్నారు. 10వ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్ పరీక్షలను తక్షణమే రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని కోరారు పవన్ కళ్యాణ్.

సామ్రాట్

Next Story