టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళగిరి లోని టీడీపీ ఆఫీసుకు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.